• Login / Register
  • Chief Secretary Review | ఈ నెల 17 నుంచి గ్రూప్‌-3 ప‌రీక్ష‌లు

    Chief Secretary Review | ఈ నెల 17 నుంచి గ్రూప్‌-3 ప‌రీక్ష‌లు
    ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
    రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల‌లో ప‌రీక్ష‌లు
    కొత్త న‌ర్సింగ్‌, పారామెడిక‌ల్ ప్రారంభం, కుల గ‌ణ‌న‌, ప‌త్తి కొనుగోళ్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

    Hyderabad : రాష్ట్రంలో  ఈ నెల 17, 18 తేదీల‌లో నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా టీజీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ్రూప‌-3 ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షల మంది విద్యార్థులు గ్రూప్‌-3 పరీక్షలకు హాజరవుతున్నారని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి తెలిపారు.  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ద్వారా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రూప్-1 పరీక్షల మాదిరిగానే  గ్రూప్-3 పరీక్షలను కూడా సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు స్వయంగా పర్యవేక్షించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు ఉండేలా చూడాలని, ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పరీక్షల నిర్వహణకు కమిషన్ చేసిన ఏర్పాట్లను సంక్షిప్తంగా వివరించారు. పరీక్షలను పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 
              రాష్ట్రంలో వ‌రి, పత్తి కొనుగోళ్ల పురోగతి, కొత్త నర్సింగ్,  పారామెడికల్ కాలేజీల ప్రారంభం, కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే వంటి ప్రధాన అంశాల పై బుధవారం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ మేర‌కు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రస్తావిస్తూ,  జిల్లా కలెక్టర్లు వరి ధాన్యం రాకను ప్రతిరోజూ నిశితంగా పరిశీలించాలన్నారు. వరి దిగుబడి కి అనుగుణంగా  కొనుగోళ్లు జరిగేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సీజన్‌లో గ‌తంలో ఎప్పుడు లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందుకు  క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. అలాగే గోదాములకు ధాన్యం రవాణా చేయాలని, త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్లను కోరారు. ప్రత్యేక అధికారులు తమ నిర్దేశిత జిల్లాల్లో వరి తరలింపును పర్యవేక్షించాలని, సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా సమస్యలను పరిష్కరించి రైతుల్లో విశ్వాసాన్ని నింపాలని పేర్కొన్నారు. అధికారులందరూ తప్పనిసరిగా ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎస్‌ ఆదేశించారు. కొత్తగా మంజూరైన నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న‌ మరమ్మత్తు పనులను కూడా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ కోరారు. సామాజిక ఆర్థిక కులాల సర్వే సజావుగా జరిగినందుకు కలెక్టర్లను ఆమె అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ‌ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    *  *  *

    Leave A Comment